Home ఆదికాండము 47 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 47

తెలుగు బైబిల్
1యోసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి 2తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. 3ఫరో అతని సహోదరులను చూచి - మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు - నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి. 4మరియు వారు - కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితివిు. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా 5ఫరో యోసేపును చూచి - నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు. 6ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను 7మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. 8ఫరో - నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగి నందుకు 9యాకోబు - నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి 10ఫరోను దీవించి ఫరో యెదుటనుండి వెళ్లిపోయెను. 11ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను. 12మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. 13కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. 14వచ్చినవారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. 15ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపు నొద్దకు వచ్చి - మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. 16అందుకు యోసేపు - మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసికొనవచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను 17ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. 18ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు. 19నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి. 20అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను. 21అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. 22యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. 23యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు; పొలములలో విత్తుడి. 24పంటలో అయిదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా 25వారు - నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. 26అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు. 27ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. 28యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు. 29ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి - నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. 30నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. 31అందుకతడు - నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు - నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme