Genesis 28 · తెలుగు బైబిల్

Genesis

Chapter 28

తెలుగు బైబిల్
1ఇస్సాకు యాకోబును పిలిపించి - నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.
2నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి
3సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామున కిచ్చిన దేశమును, నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు
4ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను.
5అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.
6ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు
7యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లి పోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు,
8ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు
9ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు
11ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను.
12అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
13మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.
14నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.
15ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
16యాకోబు నిద్ర తెలిసి - నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని
17భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు;
18పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
19మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
20అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,
21తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును.
22మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme