Home ఆదికాండము 21 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 21

తెలుగు బైబిల్
1యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను. 2ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను. 3అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. 4మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. 5అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు. 6అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను. 7మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను. 8ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. 9అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి 10ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను. 11అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. 12అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును. 13అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను. 14కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. 15ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి 16యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను. 17దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు; 18నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. 19మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. 20దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. 21అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను. 22ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక. 23నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. 24అందుకు అబ్రాహాము ప్రమాణము చేసెదననెను. 25అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు ఈ పని యెవరు చేసిరో నేనెరుగను; 26నీవును నాతో చెప్పలేదు; నేను నేడే గాని యీ సంగతి వినలేదని చెప్పగా. 27అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి. 28తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలో నుండి యేడు పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక 29అబీమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు 30నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱె పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను. 31అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. 32బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను. 33అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. 34అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme