Genesis 13 · తెలుగు బైబిల్

Genesis

Chapter 13

తెలుగు బైబిల్
1అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను.
2అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను.
3అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి
4తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
5అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక
6వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.
7అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.
8కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండ కూడదు.
9ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమ తట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా
10లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.
11కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి.
12అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను.
13సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి.
14లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోట నుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము;
15ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.
16మరియు నీ సంతానమును భూమి మీదనుండు రేణువులవలె విస్తరింపచేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.
17నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.
18అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme