Genesis 31 · తెలుగు బైబిల్

Genesis

Chapter 31

తెలుగు బైబిల్
1లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
2మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
3అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా
4యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.
5మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
6మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.
7మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
8అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.
9అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.
10మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.
11మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.
12అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని
13నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
14అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా?
15అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.
16దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తర మియ్యగా
17యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి
18కనాను దేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను.
19లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.
20యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను.
21అతడు తనకు కలిగిన దంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
22యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను.
23అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.
24ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చినీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.
25లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.
26అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?
27నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.
28అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టు కొననియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.
29మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.
30నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరిన యెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా
31యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని
32ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.
33లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారము లోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములోనుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను.
34రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు.
35ఆమె తన తండ్రితో తమ యదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.
36యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమ నేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి?
37నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.
38ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచు కొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.
39దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.
40పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.
41ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.
42నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
43అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారుల నైనను నేనేమి చేయగలను.
44కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
45యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.
46మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
47లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
48లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
49అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,
50మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.
51మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.
52హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
53అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
54యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.
55తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లి పోయెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme