Home ఆదికాండము 24 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 24

తెలుగు బైబిల్
1అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. 2అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము; 3నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక 4నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను. 5ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొనిపోవలెనా అని అడుగగా 6అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ. 7నా తండ్రి యింట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు. 8అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను. 9ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను. 10అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమా నుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి 11సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోక రింపచేసి యిట్లనెను 12నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. 13చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచు చున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. 14కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను. 15అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను. 16ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా 17ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను. 18అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. 19మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి 20త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను. 21ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలిసికొనవ లెనని ఊరకుండెను. 22ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి 23నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. 24అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. 25మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా 26ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి 27అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను . 28అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను. 29రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను. 30అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా 31లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను. 32ఆ మనుష్యుడు ఇంటికి వచ్చి నప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి 33అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. 34అంతట అతడిట్లనెను. నేను అబ్రాహాము దాసుడను, 35యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. 36నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి యున్నాడు; 37మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు. 38అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను. 39అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు 40అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు. 41నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యని యెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. 42నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన యెడల 43నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్న దానితో నేనునీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు 44నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవి చేసికొంటిని. 45నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావి లోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా 46ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. 47అప్పుడు నేను - నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె - మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతుల కడియములను పెట్టి 48నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. 49కాబట్టి నా యజమానుని యెడల మీరు దయను నమ్మకమును కనుపరచిన యెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా 50లాబానును బెతూయేలును ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవునని గాని కాదనిగాని చెప్ప జాలము; 51ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి. 52అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. 53తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. 54అతడును అతనితో కూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా 55ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ననిరి. 56అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు 57వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని 58రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను. 59కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు 60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా 61రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. 62ఇస్సాకు బెయేర్‌ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. 63సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను, 64రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీదనుండి దిగి 65మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను. 66అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను. 67ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme