Genesis 32 · తెలుగు బైబిల్

Genesis

Chapter 32

తెలుగు బైబిల్
1యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.
2యాకోబు వారిని చూచి - ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.
3యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి
4మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;
5నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.
6ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగివచ్చి - మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితివిు; అతడు నాలుగువందల మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా
7యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి
8ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను.
9అప్పుడు యాకోబు - నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,
10నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.
11నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.
12నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.
13అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను
14అనగా రెండువందల మేకలను ఇరువది మేక పోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను
15ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా
16తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.
17మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని - నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల
18నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.
19అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచి
20మీరు - ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.
21అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను.
22ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను.
23యాకోబు వారిని తీసి కొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను.
24యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.
25తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.
26ఆయన - తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు - నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.
27ఆయన నీ పేరేమని యడుగగా అతడు - యాకోబు అని చెప్పెను.
28అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.
29అప్పుడు యాకోబు - నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన - నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
30యాకోబు - నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
31అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.
32అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme