Home కీర్తనలు 80 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 80

తెలుగు బైబిల్
1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము. 2ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము. 3దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము. 4యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగరాజనిచ్చెదవు? 5కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు. 6మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా జేయు చున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. 7సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము రప్పించుము. మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము. 8నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి 9దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను 10దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. 11దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను. 12త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి? 13అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. 14సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. 15నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. 16అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు. 17నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. 18అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము 19యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme