Psalm
Chapter 31
తెలుగు బైబిల్1యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
2నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.
3నా కొండ నాకోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే.
4నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము.
5నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.
6నేను యెహోవాను నమ్ముకొని యున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు.
7నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో షించెదను.
8నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.
9యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి.
10నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.
11నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి పోవుదురు.
12మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని.
13అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.
14యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.
15నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.
16నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము.
17యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందు వారు మౌనులై యుందురు గాక.
18అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.
19నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు
21ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాక.
22భీతిచెందినవాడనై నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనలధ్వని నాలకించితివి.
23యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును.
24యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.