Psalm 145 · తెలుగు బైబిల్

Psalm

Chapter 145

తెలుగు బైబిల్
1రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
2అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
3యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
4ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు
5మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను
6నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించె దరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.
7నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు
8యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.
9యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.
10యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.
11ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై
12నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
13నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.
14యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు
15సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.
16నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.
17యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు
18తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
19తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.
20యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును
21శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme