Psalm 132 · తెలుగు బైబిల్

Psalm

Chapter 132

తెలుగు బైబిల్
1యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
2అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి
3యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.
4ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు
5నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
6అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను.
7ఆయన నివాసస్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.
8యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.
9నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.
10నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.
11నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని
12యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.
13యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.
14ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను
15దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను
16దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప జేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.
17అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.
18అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme