Proverbs 19 · తెలుగు బైబిల్

Proverbs

Chapter 19

తెలుగు బైబిల్
1బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.
2ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును
3అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.
4ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును.
5కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.
6అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.
7బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు.
8బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.
9కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.
10భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.
11ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
12రాజు కోపము సింహగర్జనవంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.
13బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటుతెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.
14గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.
15సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.
16ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును.
17బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
18బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.
19మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.
20నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.
21నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.
22కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.
23యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.
24సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.
25అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.
26తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
27నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.
28వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.
29అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme