Proverbs 25 · తెలుగు బైబిల్

Proverbs

Chapter 25

తెలుగు బైబిల్
1ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి.
2సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత.
3ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు.
4వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.
5రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును.
6రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము.
7నీ కన్నులు చూచిన ప్రధానియెదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటె ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా.
8ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిదాని అంత మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.
9నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము.
10బయటపెట్టినయెడల వినువాడు నిన్ను అవమానపరచు నేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి యెన్నటికిని పోకుండును.
11సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.
12బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు.
13నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును.
14కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు.
15దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించ వచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.
16తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము అధికముగా త్రాగినయెడల కక్కి వేయుదువేమో
17మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో.
18తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.
19శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము.
20దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోను సురేకారముమీద చిరకపోయువానితోను సమానుడు.
21నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము
22అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.
23ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.
24గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు
25దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును.
26కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు.
27తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము.
28ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme