Proverbs
Chapter 15
తెలుగు బైబిల్1మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
2జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
3యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.
4సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.
5మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.
6నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.
7జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
8భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
9భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.
10మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.
11పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన బడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా?
12అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.
13సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
14బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు.
15బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.
16నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.
17పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
18కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
19సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
20జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
21బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.
22ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
23సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
24క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును
25గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.
26దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.
27లోభి తన యింటివారిని బాధపెట్టును లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును.
28నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
29భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
30కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును.
31జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.
32శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును.
33యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.