Proverbs 3 · తెలుగు బైబిల్

Proverbs

Chapter 3

తెలుగు బైబిల్
1నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.
2అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును.
3దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
4అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.
5నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము
6నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
7నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము
8అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.
9నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
10అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.
11నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు.
12తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
13జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
14వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.
15పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
16దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
17దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
18దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
19జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
20ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
21నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
22అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
23అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
24పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
25ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
26యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
27మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
28ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
29నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
30నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు.
31బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు
32కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.
33భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
34అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.
35జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme