Proverbs 21 · తెలుగు బైబిల్

Proverbs

Chapter 21

తెలుగు బైబిల్
1యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.
2ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.
3నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
4అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.
5శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును
6అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.
7భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును.
8దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.
9గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.
10భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.
11అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
12నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కని పెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.
13దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.
14చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతి పరచును.
15న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.
16వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును.
17సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు.
18నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు
19ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.
20విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
21నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.
22జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.
23నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
24అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.
25సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.
26దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
27భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.
28కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
29భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.
30యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
31యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme