Jeremiah
Chapter 27
తెలుగు బైబిల్1యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
2యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.
3వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.
4మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా
5అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.
6ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.
7అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.
8ఏ జనము ఏ రాజ్యము బబులోనురాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనముచేయించు వరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
9కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి.
10మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.
11అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
12నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు
13బబులోనురాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలును చావనేల?
14కావునమీరు బబులోను రాజునకు దాసులుకాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్దమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు.
15నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించు నట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవ చించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజలందరితోను నేను ఈ మాటలు చెప్పితిని
16యెహోవా సెలవిచ్చునదేమనగాయెహోవా మందిరపు ఉపకరణ ములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.
17వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?
18వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.
19బబులోను రాజైన నెబుకద్రెజరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు
20అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు సముద్రమును గూర్చియు గడమంచెలను గూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చియు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
21యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు
22అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.