Jeremiah
Chapter 19
తెలుగు బైబిల్1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
2నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.
3నీ విట్లనుము - యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి; సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, దాని సమాచారము వినువారందరికి చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవుచున్నాను.
4ఏలయనగా వారు నన్ను విసర్జించి యీ స్థలములో అపచారము చేసి యున్నారు, వారైనను వారి తండ్రులైనను యూదా రాజు లైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తముచేత ఈ స్థలమును నింపిరి
5నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచ నిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.
6ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్ హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.
7తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణములనుతీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళే బరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను.
8ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడు గాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.
9వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును.
10ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను
11సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మరల బాగుచేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్ట బోవుచున్నాను; తోఫెతులో పాతిపెట్టుటకు స్థలములేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు.
12యెహోవా వాక్కు ఇదే ఈ పట్టణమును తోఫెతువంటి స్థలముగా నేను చేయుదును, ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును.
13యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులును ఆ తోఫెతు స్థలమువలెనే అపవిత్రములగును; ఏ యిండ్లమీద జనులు ఆకాశ సమూహమను దేవతలకు ధూపము వేయుదురో, లేక అన్యదేవతలకు పానార్పణములనర్పించుదురో ఆ యిండ్లన్నిటికి ఆలాగే జరుగును.
14ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులోనుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను.
15సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండ మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమునుగూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటిమీదికిని రప్పించుచున్నాను.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.