Jeremiah
Chapter 25
తెలుగు బైబిల్1యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబులోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
2ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరి తోను యెరూషలేము నివాసులందరితోను ఆ వాక్కును ప్రకటించెను.
3ఆమోను కుమారుడును యూదారాజునైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.
4మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయుటయు మాని,
5మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగినయెడల, యెహోవా మీకును మీ పితరులకును నిత్యనివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై,
6యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.
7అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
8సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువ నంపించుచున్నాను;
9ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
10సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.
11ఈ దేశమంతయు పాడుగాను నిర్జనము గాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు.
12యెహోవా వాక్కు ఇదే డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.
13నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నియు యిర్మీయా ఈ జనములన్నిటినిగూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశముమీదికి రప్పించెదను.
14ఏలయనగా నేను వారి క్రియలనుబట్టియు వారి చేతి కార్యములనుబట్టియు వారికి ప్రతికారము చేయునట్లు అనేక జనములును మహారాజులును వారిచేత సేవ చేయించు కొందురు.
15ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము.
16వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.
17అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.
18నేటివలెనే పాడు గాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదము గాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.
19మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును
20సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజ యును, ఎక్రోనును అష్డోదు శేషపువారును
21ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును
22తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును
23దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొను వారందరును
24అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
25జిమీ రాజు లందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును
26సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకురాజు వారి తరువాత త్రాగును.
27నీవు వారితో ఈలాగు చెప్పుము ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడుదురు.
28మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుము మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
29నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించు చున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
30కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రకటించి, ఈలాగు చెప్పవలెను ఉన్నత స్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారివలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికి విరోధముగా ఆర్భటించు చున్నాడు.
31భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు.
32సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనమునుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళ్లుచున్నది.
33ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.
34మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దినములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు.
35మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠమైన వాటికి రక్షణ దొరకకపోవును,
36ఆలకించుడి, మంద కాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవా వారి మేతభూమినిపాడు చేసియున్నాడు.
37నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను;
38క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.