Home యిర్మియా 34 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 34

తెలుగు బైబిల్
1బబులోనురాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురము లన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు. 2ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజుచేతికి అప్పగించు చున్నాను, అతడు మంటపెట్టి దాని కాల్చివేయును. 3నీవు అతని చేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయ ముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖా ముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు. 4యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము నిన్నుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గమువలన మృతిబొందక నెమ్మదిగానే మృతి బొందెదవు. 5నీకంటె ముందుగానుండిన పూర్వరాజులైన నీ పితరులకొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా యేలినవాడా, అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీకొరకును ధూపద్రవ్యము కాల్చుదురు; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 6యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములుగల పట్టణములుగా మిగిలి యున్నవి, 7బబులోనురాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటిని ప్రకటించుచు వచ్చెను. 8యూదులచేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులనుగాని హెబ్రీయు రాండ్రనుగాని అందరిని విడిపించునట్లు విడుదలచాటింప 9వలెనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవాయొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు 10ఆ నిబంధననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్న వారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారిచేత కొలువు చేయించుకొనమనియు, ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి. 11అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచు కొనిరి. 12కావున యెహోవాయొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 13ఇశ్రా యేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని. 14నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి. 15మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని యొక్కొక్కడు తన పొరుగు వానికి విడుదల చాటింతమని చెప్పి, నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. 16పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రు లుగా పోనిచ్చిన తరువాత, అందరును తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరచుకొంటిరి 17కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యము లన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను. 18మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను; 19అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. 20వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతికిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును. 21యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్ళిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. 22యెహోవా వాక్కు ఇదేనేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించు చున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme