Job 12 · తెలుగు బైబిల్

Job

Chapter 12

తెలుగు బైబిల్
1అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
2నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.
3అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
4నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
5దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమను కొందురు. కాలుజారు వారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.
6దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
7అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును. ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
8భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును
9వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు?
10జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.
11అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?
12వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు
13జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.
14ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.
15ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.
16బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు.
17ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.
18రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.
19యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.
20వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
21అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.
22చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును
23జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.
24భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచునుత్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.
25వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme