Home యోబు 15 · తెలుగు బైబిల్

యోబు

Chapter 15

తెలుగు బైబిల్
1అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను 2జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా? 3వ్యర్థసంభాషణ చేత వ్యాజ్యెమాడ దగునా? నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా? 4నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. 5నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. 6నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవినీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. 7మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? 8నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? 9మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? 10నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులును మాలో నున్నారు నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు. 11దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా? 12నీ హృదయము ఏల క్రుంగిపోయెను?నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి? 13దేవుని మీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు? 14శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? 15ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు. 16అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా. 17నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించెదను. 18జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. 19అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. 20తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును. 21భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు. 22తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. 23అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును. 24శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును. 25వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును. 26మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును. 27వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కల పైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి. 28అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరును నివసింపకూడని యిండ్లలో దిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు 29కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు. వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు 30వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు. 31వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయిన వారుమాయయే వారికి ఫలమగును. 32వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. 33ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును 34భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును 35వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme