Job
Chapter 11
తెలుగు బైబిల్1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
3నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
4నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
5దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు
6ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
7దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?
8అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?
9దాని పరిమాణము భూమికంటె అధికమైనది దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది
10ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు?
11పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలనచేయక యే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా.
12అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.
13నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీ చేతులు ఆయనవైపు చాపినయెడల
14పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచిన యెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల
15నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.
16నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.
17అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.
18నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు.
19ఎవరి భయము లేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు.
20దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.