Isaiah
Chapter 32
తెలుగు బైబిల్1ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.
2మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.
3చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.
4చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.
5మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.
6మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.
7మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
8ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
9సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.
10నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.
11సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.
12రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు.
13నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు
14నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును
15అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.
16అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును
17నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
18అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును
19పట్టణము నిశ్చయముగా కూలిపోవును.
20సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.