Isaiah 49 · తెలుగు బైబిల్

Isaiah

Chapter 49

తెలుగు బైబిల్
1ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.
2నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.
3ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను.
4అయిననువ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయపరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది.
5యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు
6నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.
7ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.
8యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.
9మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును
10వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.
11నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.
12చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.
13శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.
14అయితే సీయోనుయెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.
15స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
16చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
17నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో నుండి బయలు వెళ్లుచున్నారు.
18కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
19నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.
20నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమా రులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.
21అప్పుడు నీవునేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా డెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.
22ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయియెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు
23రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.
24బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొన గలడు? భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా?
25యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.
26యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme