Isaiah 60 · తెలుగు బైబిల్

Isaiah

Chapter 60

తెలుగు బైబిల్
1నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
2చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
3జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.
4కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.
5నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.
6ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె లును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.
7నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
8మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?
9నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.
10అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
11నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
12నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.
13నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.
14నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.
15నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.
16యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.
17నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగానునీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.
18ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.
19ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.
20నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.
21నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.
22వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme