Acts 22 · తెలుగు బైబిల్

Acts

Chapter 22

తెలుగు బైబిల్
1సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.
2అతడు హెబ్రీభాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.
3నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి
4ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.
5ఇందునుగూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారినికూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.
6నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.
7నేను నేలమీద పడి సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.
8అందుకు నేను ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయననేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.
9నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.
10అప్పుడు నేను ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.
11ఆ వెలుగు యొక్క ప్రభావమువలన నేను చూడలేక పోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని.
12అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి
13సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టిపొంది అతని చూచితిని.
14అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియ మించియున్నాడు;
15నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.
16గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.
17అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని.
18అప్పుడాయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.
19అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచుకొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.
20మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేనుకూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.
21అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
22ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించు చుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.
23వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా
24వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.
25వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
26శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
27అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా
28అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలునేనైతే పుట్టుకతోనే రోమీయుడ ననెను.
29కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను.
30మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme