Acts
Chapter 4
తెలుగు బైబిల్1వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును
2వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి
3వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.
4వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.
5మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.
6ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.
7వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా
8పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,
9ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక
10మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.
11ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
12మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
13వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
14స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
15అప్పుడు సభ వెలుపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి
16ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయ బడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారి కందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము.
17అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడ కూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.
18అప్పుడు వారిని పిలిపించిమీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.
19అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;
20మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
21ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
22స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.
23వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.
24వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
25అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?
26ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
27ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
28వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
29ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి
30రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయు టకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్ర హించుము.
31వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
32విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.
33ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.
34భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.
35వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
36కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి
37దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
Bible Study with Steffi App
Download Free ↗
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.