Song of Solomon 7 · తెలుగు బైబిల్

Song of Solomon

Chapter 7

తెలుగు బైబిల్
1రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు చున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.
2నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి
3నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.
4నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.
5నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.
6నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో నీవు అతిసుందరమైనదానవు అతి మనోహరమైనదానవు.
7నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి.
8తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.
9నీ నోరు శ్రేష్టద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును.
10నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.
11నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము.
12పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను
13పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme