Song of Solomon 5 · తెలుగు బైబిల్

Song of Solomon

Chapter 5

తెలుగు బైబిల్
1నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.
2నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.
3నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?
4తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతనియెడల జాలిగొనెను.
5నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను
6నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు.
7పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.
8యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.
9స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?
10నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
11అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణ ములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
12అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.
13అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
14అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.
15అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము
16అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme