Judges 9 · తెలుగు బైబిల్

Judges

Chapter 9

తెలుగు బైబిల్
1యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో నున్న తన తల్లి సహోదరులయొద్దకుపోయి వారి తోను తన తల్లి పితరుల కుటుంబికులందరితోను
2మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి మీకేది మంచిది? యెరుబ్బయలుయొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుటమంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుటమంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను.
3అతని తల్లి సహోదరులు అతనిగూర్చి షెకెము యజమా నులు వినునట్లు ఆ మాటలన్నియు చెప్పగా వారుఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి;
4అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి.
5తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారు లును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను.
6తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షముక్రింద దండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి.
7అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెనుషెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును.
8చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి
9మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
10అప్పుడు చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా
11అంజూ రపు చెట్టుచెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగు టకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.
12అటుతరువాత చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి
13దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
14అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా
15ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియ మించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.
16నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించెను.
17అయితే మీరు నా తండ్రి కుటుంబముమీదికి లేచి, యొక రాతిమీద అతని కుమారులైన డెబ్బదిమంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహో దరుడైనందున షెకెము వారిమీద అతనిని రాజుగా నియమించి యున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని యింటి వారియెడలను మీరు ఉపకారము చేయకయు
18అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలె కును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల
19నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీ యందు సంతోషించునుగాక.
20లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకె మువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి
21తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.
22అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను.
23అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,
24అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.
25ఎట్లనగా షెకెము యజ మానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారి నందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను.
26ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్ర యించిరి.
27వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా
28ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదము గాని మనము అతని కెందుకు దాసులము కావలెను?
29ఈ జనము నా చేతిలో ఉండిన యెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను.
30ఆ పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలుమాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను.
31అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపిఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చి యున్నారు, వారు నీమీదికి ఈ పట్టణమును రేపు చున్నారు.
32కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి,
33ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముమీద పడ వలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను.
34అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచి యుండిరి.
35ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్ట ణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితో నున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి.
36గాలు ఆ జనులను చూచి జెబులుతోఇదిగో జనులు కొండశిఖరముల మీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులుకొండల చాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను.
37గాలుచూడుము, దేశపు ఎత్తయినప్థల మునుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను.
38జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమా యెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా
39గాలు షెకెము యజ మానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.
40అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.
41అప్పుడు అబీ మెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.
42మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.
43అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసికొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి; అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీద పడి వారిని హతముచేసెను.
44అబీమెలెకును అతనితో నున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలముల లోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి.
45ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.
46షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్‌ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.
47షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీ మెలెకునకు తెలుపబడినప్పుడు
48అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.
49అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి.
50తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను.
51ఆ పట్టణమునడుమ ఒక బల మైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజ మానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి.
52అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా
53ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను.
54అప్పుడతడు తన ఆయుధము లను మోయుబంటును త్వరగా పిలిచిఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను.
55అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి.
56అట్లు అబీమెలెకు తన డెబ్బదిమంది సహోదరు లను చంపుటవలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతనిమీదికి రప్పించెను.
57షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలలమీదికి మరల రాజే సెను; యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారిమీదికి వచ్చెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme