Ezekiel 11 · తెలుగు బైబిల్

Ezekiel

Chapter 11

తెలుగు బైబిల్
1పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్నుదింపగా గుమ్మపు వాకిట ఇరువదియైదుగురు మనుష్యులు కనబడిరి; వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి.
2అప్పుడాయన నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా యీ పట్టణము పచనపాత్రయనియు, మనము మాంసమనియు, ఇండ్లు కట్టుకొన అవసరములేదనియు చెప్పు కొనుచు
3ఈ పట్ణణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే.
4కావున వారికి విరోధముగా ప్రవచింపుము; నరపుత్రుడా, ప్రవచింపుము.
5అంతట యెహోవా ఆత్మ నామీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయుము, యెహోవా సెలవిచ్చిన మాట యిదే ఇశ్రాయేలీయులారా, మీరీ లాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి.
6ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీచేత హతులైన వారితో వీధులు నిండియున్నవి.
7కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు హతముచేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము, ఈ పట్టణమే పచన పాత్ర, యీ పట్టణములోనుండి మిమ్మును వెళ్ల గొట్టుదును.
8మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీమీదికి ఖడ్గము రప్పించెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
9మరియు మీకు శిక్ష విధించి పట్టణములోనుండి మిమ్మును వెళ్లగొట్టి అన్యులచేతికి మిమ్మునప్పగించుదును.
10ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గముచేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
11మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచనపాత్రగా ఉండదు; నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును.
12అప్పుడు మీ చుట్టు నున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడల ననుసరింపక మానితిరో యెవని విధులను ఆచరింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలిసికొందురు.
13నేను ఆ ప్రకారము ప్రవచింపు చుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి యెలుగెత్తి–అయ్యో, ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా? అని మొఱ్ఱపెట్టితిని.
14అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
15నరపుత్రుడా, యెరూషలేము పట్టణపువారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్య బడెను, మీరు యెహోవాకు దూరస్థులుగా నుండుడి, అని యెవరితో చెప్పుచున్నారో వారందరు ఇశ్రాయేలీయులై నీకు సాక్షాద్బంధువులును నీచేత బంధుత్వధర్మము నొందవలసినవారునై యున్నారు.
16కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆ యా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆ యా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును.
17కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా ఆ యా జనముల మధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి, ఇశ్రాయేలుదేశమును మీ వశము చేసెదను.
18వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి, తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.
19వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.
20అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.
21అయితే తమ విగ్రహములను అనుసరించుచు, తాము చేయుచు వచ్చిన హేయక్రియలను జరిగింప బూనువారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
22కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను.
23మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకుపైగా నిలిచెను.
24తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.
25అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటిని చెరలో ఉన్నవారికి నేను తెలియజేసితిని.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme