Mark 4 · తెలుగు బైబిల్

Mark

Chapter 4

తెలుగు బైబిల్
1ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.
2ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను
3వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
4వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను.
5కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని
6సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను.
7కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు.
8కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదం తలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను.
9వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
10ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యులతో కూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి.
11అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని
12వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను
13మరియుఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను.
14విత్తువాడు వాక్యము విత్తు చున్నాడు.
15త్రోవప్రక్క నుండు వారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును.
16అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు;
17అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు.
18ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు;
19వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును.
20మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.
21మరియు ఆయన వారితో ఇట్లనెనుదీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా
22రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచ బడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు
23వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను.
24మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.
25కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
26మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి,
27రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.
28భూమి మొదట మొల కను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును.
29పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను.
30మరియు ఆయన ఇట్లనెను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము?
31అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే గాని
32విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదైగొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను.
33వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేక మైన ఉపమానములను చెప్పి, ఆయన వారికి వాక్యము బోధించెను.
34ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను.
35ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా,
36వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను.
37అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.
38ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి - బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి.
39అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.
40అప్పుడాయన మీరెందుకు భయపడు చున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను.
41వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme