Home విలాపవాక్యములు 3 · తెలుగు బైబిల్

విలాపవాక్యములు

Chapter 3

తెలుగు బైబిల్
1నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను. 2ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. 3మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు 4ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు 5నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు 6పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు 7ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు 8నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు. 9ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు 10నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు 11నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కు లేకుండ చేసియున్నాడు 12విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు 13తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను. 14నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని. 15చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను 16రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను. 17నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను. 18నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. 19నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము. 20ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. 21నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది. 22యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. 23అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. 24యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను. 25తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. 26నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 27యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. 28అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను. 29నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. 30అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను 31ప్రభువు సర్వకాలము విడనాడడు. 32ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును. 33హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. 34దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు 35మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు 36ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు. 37ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు? 38మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా? 39సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు? 40మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. 41ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. 42మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు. 43కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుముచున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు. 44మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు. 45జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టియున్నావు. 46మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు. 47భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. 48నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. 49యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు 50నా కన్నీరు ఎడతెగక కారుచుండును. 51నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. 52ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. 53వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి 54నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. 55యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా 56నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము. 57నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి. 58ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెములను వాదించితివి నా జీవమును విమోచించితివి. 59యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము. 60పగతీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచనలన్నియు నీవెరుగుదువు. 61యెహోవా, వారి దూషణయు వారు నామీద చేయు ఆలోచనలన్నిటిని 62నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు. 63వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని. 64యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు. 65వారికి హృదయకాఠిన్యము నిత్తువు వారిని శపించుదువు. 66నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశము క్రింద నుండకుండ వారిని నశింపజేయుదువు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme