Hebrews 12 · తెలుగు బైబిల్

Hebrews

Chapter 12

తెలుగు బైబిల్
1ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
2మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.
3మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.
4మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.
5మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము
6ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
7శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
8కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
9మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
10వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు.
11మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
12కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
13మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.
14అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
15మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
16ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.
17ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.
18స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును,
19బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక,
20ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి.
21మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషేనేను మిక్కిలి భయపడి వణకు చున్నాననెను.
22ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,
23పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,
24క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.
25మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.
26అప్పు డాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.
27ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్ధమిచ్చుచున్నది.
28అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,
29ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme