Exodus 10 · తెలుగు బైబిల్

Exodus

Chapter 10

తెలుగు బైబిల్
1కాగా యెహోవా మోషేతో ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను
2నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.
3కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి - హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా - నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
4నీవు నా జనులను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను.
5ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.
6మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.
7అప్పుడు ఫరో సేవకులు అతని చూచి - ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి.
8మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడుమీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను.
9అందుకు మోషే - మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెద మనెను.
10అందు కతడు - యెహోవా మీకు తోడై యుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు.
11పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.
12అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశము మీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటని తినివేయునని చెప్పెను.
13మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.
14ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకర మైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.
15ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.
16కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.
17మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా
18అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
19అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలవలేదు.
20అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.
21అందుకు యెహోవా మోషేతో - ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.
22మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను.
23మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.
24ఫరో మోషేను పిలిపించి - మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా
25మోషే - మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.
26మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.
27అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.
28గనుక ఫరోనా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.
29అందుకు మోషే - నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme