2 Corinthians 3 · తెలుగు బైబిల్

2 Corinthians

Chapter 3

తెలుగు బైబిల్
1మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టు చున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?
2మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?
3రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
4క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.
5మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
6ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
7మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహి మతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.
8ఇట్లుండగా ఆత్మసంబంధ మైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?
9శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కల దగును.
10అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.
11తగ్గిపోవునదే మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా.
12తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను.
13మేమట్లు చేయక, యిట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాటలాడు చున్నాము.
14మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.
15నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని
16వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
17ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
18మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme